వస్తున్నాం వస్తున్నాం.. లింగమయ్యా

ఈ మాట పలుకుతూ జన సంద్రం నల్లమల అడవుల్లో దేవదేవుని దివ్యదర్శనానికై కదిలింది. మండే ఎండలు కూడా లెక్కచెయ్యకుండా అడవంతా హరహర నామస్మరణతో పులకించింది. ఈ మహా యజ్ఞంలో మేముకూడా సమిధలు అవడం మహదభ్గాగ్యం కదూ... అసలు ఈ యాత్ర ప్రారంభమే ఒక అద్భుతం. చిలుకూరు బాలాజీ దర్శనంతో ప్రారంభించడం వల్ల సర్వం శుభప్రదమే కదా. సాయంత్రం వెళ్ళడంతో భక్తజనం తక్కువగా ఉండి చక్కటి దర్శనం ఎక్కువసేపు చేసుకున్నాం. స్వామి పక్కనున్న శ్రీదేవి భూదేవి కూడా కన్నులవిందుగా కనిపించారు. శ్రీరాముడు శ్రీశైలం ఉత్తర ద్వారంలో ఉన్న ఉమా మహేశ్వరుడిని దర్శించుకొని ఆ తరువాతే మల్లన్నని పూజించాడట. అటువంటి స్వామికి అభిషేకం చేసుకొని సలేస్వరం బయలుదేరాం. సలేశ్వరం అడవుల్లో వెలసిన లింగమయ్య ఏటా చైత్రపౌర్ణమికి మాత్రమే దర్శనమిస్తాడు. ఈ ఏడు మమ్మల్ని కూడా పిలిచాడు. పౌర్ణమి వెలుగులో 6 మైళ్ళు అడవిలో కొండలు ఎక్కీదిగీ ఆయనపై మాకున్న ప్రేమని చూపిస్తే, పరమ సంతోషంతో బదులుగా తన దివ్యదర్శనం ప్రసాదించాడు. అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే త్రోవలో బుగ్గ మల్లన్న దర్శనం ఇంకొక అనిర్వచనీయ అనుభూతి. ఆ తరువాత మల్లికార్జునుని, భ్రమరాంబికా దేవిని...