శివరాత్రి సంబరం

ముక్కంటిని దర్శించుకోవడానికి ఆయనకు ఇష్టమైన శివరాత్రి పర్వదినం కంటే మంచిరోజు దొరుకుతుందా? అయ్యోరిని చూడటానికి రెండు కన్నులు చాలలేదు, అభిషేకానికి బిందెడు నీరు సరిపోలేదు, తల ఆనించి తాకుతూ ఉంటే సమయం తెలియలేదు, చేతులారా స్పృశిస్తూ ఉంటే గుండె గెంతులు ఆపడంలేదు, శివుని పక్కనే కూర్చొని కబుర్లాడాలని ఉన్నా మాటలు రావడం లేదు. ఆనందం నిండిన అచేతన స్థితి - ఎంత పరవశం, అంతా శివ సంకల్పం. గుండ్ల బ్రహ్మీశ్వరంలో వెలసిన శివుడిని దర్శించాలని వెళ్లిన మాకు, నిరాశ ఎదురైంది. నల్లమల అడవుల్లోకి అనుమతి దొరకలేదు. వెంటనే సత్తువ తెచ్చుకొని అప్పటికప్పుడు వేరొక ప్రణాళిక ఆలోచించుకొన్నాం. మోక్షగుండంలో వెలసిన ముక్తీశ్వర స్వామితో మొదలుపెట్టి, నవనందులను దర్శించుకొని తరించిపోయాం. రుద్రకోటిలో ఉన్న రుద్రాణీ సమేత రుద్రకోటేశ్వర స్వామి తొలి అభిషేకం చేసే మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. కృష్ణా తుంగభద్రా సంగమంలో ధర్మరాజు కోరికమేరకు చెట్టు మాను లింగమై వెలసిన సంగమేశ్వరుడు కూడా స్పర్శ దర్శనంతో తరించమని ఆశీర్వదించాడు. అలంపురం లో బాల బ్రహ్మీశ్వర స్వామి ఆవు కాలిగిట్ట రూపంలో ఉన్నాడన...