అహోబిలం & మహానంది

ఎంతటి ప్రేమ. .. అంతటా ఉన్నావని అంతా అంటున్నా, అంతులేని ప్రపంచమంతా నిన్నుగూర్చి వెతికే మా అజ్ఞానానికి నవ్వుకోక, 'వెర్రివాళ్ళు నాకోసమేకదా వెతుకుతున్నార'ని నీ అద్భుత దర్శనాలను ప్రసాదించేంత ప్రేమ. ఎంతటి దయ... ధ్యాన దానాది సత్కర్మలను సరిగా ఆచరించక, నీ దర్శనం మాత్రమే పుణ్యమనుకొనే మాబోటి వాళ్ళ మూఢత్వానికి కోపించక, 'ఎప్పటికైనా తెలుసుకొంటారులే' అని జాలితో దీవించేంత దయ. ఎంతటి కరుణ... నీకోసం వచ్చే చిన్ని ఆలోచనని ధ్యాసగా, ధ్యాసని ఇష్టంగా, ఇష్టాన్ని భక్తిగా, భక్తిని ప్రేమగా... నీవే భావించుకొని 'నీకేంకావాలో తీసుకోరా' అని కరుణించేంత కరుణ. ఉత్తరద్వార దర్శనంతో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి, ఆద్యంతం అద్భుతంగా సాగింది. నవ నా రసింహులలో ఎనిమిది ఆలయాలని ఈ రోజు చూసాం. ఒక్కో ఆలయం, ఒకటికి మించి ఒకటి... ఒక్కో దర్శనం, ఒకటితో సరిపోలినది ఒకటి... ఒక్కో విగ్రహం, ఒకటి కాదు, సహస్ర విగ్రహాలకు సమానం. శివ కేశవులకు అభేదం కదూ.. అందుకే, నరసింహస్వామిని 'నా మదిలో శివుడిని నిలపమని' అడిగా. మహాలక్ష్మి ద...