పంచ సరోవరాలు

మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి.
 
అవి:

1. మానస సరోవరం,
2. పంపా సరోవరం,
3. పుష్కర్‌ సరోవరం,
4. నారాయణ సరోవరం,
5. బిందు సరోవరం,

1. మానస సరోవరం

మానస సరోవరం..శివుడి నివాసం!

కైలాస పర్వతం.. సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం. అందుకే జీవితంలో ఒకసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుంచి వీక్షించి, మానస సరోవరంలో స్నానమాచరించాలని భక్తులు పరితపిస్తుంటారు. కానీ సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశాన్ని దర్శించడం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. ఈ రోజు ఆ ప్రత్యేక యాత్ర విశేషాల గురించి మనమూ తెలుసుకుందాం...!

యాత్రలు..
చలికాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రికులకు ప్రతికూలంగా పరిణమిస్తుంది. కనుక యాత్రికులు సాధారణంగా ఎండాకాలం, రుతుపవనకాలాల్లో మానససరోవాన్ని దర్శిస్తారు. భారతదేశంలో ఉత్తర కాశీ, నేపాల్లోని కఠ్మాండు నుంచి ప్రతి ఏటా కైలాస యాత్రలు జరుగుతున్నాయి.

'మానస సరోవరం' అనేది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కి.మీ దూరంలో భారత్, నేపాల్ దేశాలకు దగ్గరలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యు, మపం యు ట్సొ.. అనే పేర్లతో పిలుస్తారు.

మానస సరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పునీటి సరస్సు, ఉత్తరాన హిందువులు పరమశివుని నివాసస్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 300 అడుగుల తోతు ఉన్న ఈ సరస్సు 320 చదరపు కిలోమీటర్ల ఉపరితలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. రుతుపవనాలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి -15 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. అతిశీతలమైన ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు, బండరాళ్లు, చిన్నపాటి గడ్డిమొక్కలు కనిపిస్తాయి.

సంస్కృతంలో మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు అని అర్థం. పూర్వకాలం భారతదేశం, టిబెట్, నేపాల సరిహద్దులతో సంబందం లేకుండా కలిసి ఉండటం వల్ల ఇది హిందువులకు, బౌద్ధులకు, జైనులకు కూడా పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఆలోచనల నుంచి మానససరోవరం ఆవిర్భవించి భూమిపై పడింది. ఇందులో నీరు తాగితే మరణించాక నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని, వంద జన్మల పాపాలు హరిస్తాయని.. హిందువుల విశ్వాసం. జ్ఞానం, అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని నమ్ముతారు.

పురాణేతిహాసాల ప్రకారం కైలాసగిరి, హిమాలయాలు భరత ఖండానికి చెందినవి. ఏడో శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పటి నుంచి కైలాస్‌గిరి టిబెట్ దేశానికి చెందింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస దర్శనం కష్టసాధ్యమయింది. 1959 నుంచి 1978 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఎవరినీ ఈ గిరిని దర్శించడానికి అనుమతినివ్వలేదు. ఆ తర్వాత 1980 నుంచి భారత ప్రభుత్వ అనుమతి ద్వారా వెళ్లేవారిని అనుమతిస్తున్నారు.

మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్ధం కావడానికి ముందు నుంచీ ఉదయం, సాయంత్రం నడక.. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, యోగా.. లాంటివి చేయడం మంచివి. మధుమేహం, స్పాండిలైటీస్, ఆస్తమా, సైనస్.. వంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ యాత్ర చేయలేరు. సముద్ర మట్టానికి సుమారు 5000 మీటర్ల ఎత్తుకు వెళ్లాక శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. దీన్ని నివారించడం కోసం రోజూ రాత్రి 'డైమాక్స్' అనే ట్యాబ్లెట్ వేసుకోవడ తప్పనిసరి. అక్కడి చలిని తట్టుకునే దస్తులు ధరించాలి.

ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం..
కైలాస పర్వతాన్ని టిబెటన్ భాషలో ‘రిస్‌పోచి’ అని పిలుస్తారు. ఏటా వేల మంది హిందూ భక్తులు 52 కి.మీ వరకు మాత్రమే కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించరు. పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా అనేక కారణాల వల్ల వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి.

విజ్ఞానశాస్త్రం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం కూడా అలాంటి కోవకు చెందిన ప్రాంతాలే.

 బ్రహ్మపుత్ర, గంగ, సింధు, సట్టజ్.. నదులు మానస సరోవరం నుంచే పుట్టాయనే ఒక వాదన ప్రచారంలో ఉంది.   అయితే దానికి  కచ్చితమైన ఆధారాలు లేవు.  సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బుద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు.  భారత ప్రభుత్వం ఏడాదికి సుమారు 750 మందిని మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా  ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. మానస సరోవరం ప్రాంతంలో తెల్లవారు జామున  రెండు నుంచి నాలుగున్నర గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు సరోవరానికి వస్తారని భక్తుల నమ్మకం.

2. పంపా సరోవరం

పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.

సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది. రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

3.పుష్కర సరోవరం

పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4.నారాయణ వన సరోవరం

ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ లింగాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు సరోవరం

గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు.

ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి.

అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు మొదలైనవి

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం