గొరవనహళ్ళి లక్ష్మీదేవి
భక్తి టీవీ లో పుణ్యక్షేత్రం కార్యక్రమంలో చూసిన ఒక గొప్ప క్షేత్రం, గొరవనహళ్ళి లక్ష్మీదేవి ఆలయం. చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనుకుంటూనే ఉన్నాం. ఇన్నాళ్టికి మాకు ఆ అవకాశం దొరికింది. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, ముందుగా ముక్తినాథేశ్వర స్వామి దగ్గరకి చేరుకున్నాం. సరిగ్గా, స్వామికి నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉండగా వెళ్లి, కళ్లారా ఆ తంతు అంతా పరికించి ఆనందించాం. పురాతన ఆలయం, కొత్త సొబగులతో అందంగా ఉంది. స్వామి ఇంకా మమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. అక్కడ నుంచి బయలుదేరి, పక్కనే ఉన్న విఠల ఆలయం లో కూడా అభిషేకం చూసాం. త్రోవలో ఉన్న రామ మందిరం చూసి, అక్కడ నుంచి భోగ నరసింహ స్వామి క్షేత్రానికి చేరుకున్నాం. స్వామి వైభవం అంతా ఇంతా కాదు, వర్ణించనలవి కాదు. ఆ తరువాత కొండ మీద వెలసిన యోగ నరసింహ స్వామి క్షేత్రానికి వెళ్లాం. 600 మెట్లు ఎక్కి అందమైన ప్రకృతిలో అందంగా అలరారుతున్న అయ్యవారిని, దేవేరిని చూసి మురిసిపోయాం. అక్కడినుంచి సరాసరి లచ్చమ్మ దగ్గరకి ప్రయాణం. అమ్మవారు స్వయంగా విలసిన ఈ క్షేత్ర వైభవం అనన్య సామాన్యం....