చిదంబరం - శ్రీరంగం
సెలవులు దొరికితే చాలు, ఏ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుందామా అని ఆలోచన ఉంటే బావుంటుంది కదూ. మన ఆలోచనలు అలా ఉంటే, ఆయన కూడా అటువైపు నడిపిస్తాడు సుమా.
ముందుగా, అరుణాచలం వెళ్లి, అగ్ని లింగాన్ని దర్శించుకున్నాం. నెలరోజుల్లోన్నే, రెండోసారి దర్శనం ఇచ్చిన స్వామికి కృతఙ్ఞతలు చెప్పుకొని, అక్కడి నుంచి వృద్ధాచలం వెళ్లాం. ఎంతో పురాతనమైన, అందమైన ఆలయం... ఆయనముందు చాలా సమయం గడపగలిగాం. సుందర నాయనారుని 12000 బంగారు నాణాలతో శివయ్య అనుగ్రహించిన దివ్య సుక్షేత్రం. తనివితీరా స్వామిని కళ్లారా చూసుకొని, అక్కడినుంచి శ్రీముష్ణం వెళ్లాం. అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి అయిన ఈ అద్భుత ఆలయం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. స్వామి ఎంత చక్కగా ఉన్నారో... చాలాసేపు ఆయననే చూస్తూ ఉండిపోయేసరికి, ఆలయం మూసే సమయం అయిపోయింది. అక్కడినుంచి చిదంబరం వెళ్లి అక్కడ రాత్రి బస.
మరునాడు, చిదంబరం నటరాజ స్వామి, శివకామసుందరి.. ఇద్దరూ ఇద్దరే. గంటకి పైగా ఆలయంలో గడిపినా, తనివితీరలేదు. పంచభూత శివాలయాల్లో, ఆకాశలింగం గా వెలసిన స్వామి, చిదంబర రహస్యం గా సుప్రసిద్ధమైన ప్రదేశం, స్వామిని అల్లుకొని ఉందా అన్నట్టుగా ఉన్న అమ్మవారి నామం -- అన్నీ విశేషాలే. అదే ఆలయ ప్రాకారంలో ఉన్న గోవిందరాజ స్వామి దివ్య దేశం కూడా దర్శించుకున్నాం. దగ్గరలోనే ఉన్న కాళికామాత ఆలయం కూడా దర్శించుకొని, వీర నారాయణ స్వామి ఆలయానికి వెళ్లాం. అక్కడకి వెళ్ళాకా, ఆలయం గురించి తెలుసుకొని, ఆశ్చర్యపోయాం. మా అదృష్టానికి మురిసిపోయాం. ఒక ఋషి కోరికమేరకు ఆయన కూతురిగా అక్కడ జన్మించిన లక్ష్మీదేవిని చేపట్టడానికి వీరుడిగా వచ్చిన నారాయణుడు - అందుకే స్వామి పేరు వీర నారాయణుడు. 4000 దివ్య ప్రభందాలకు ఆద్యుడైన నాదముని జన్మస్థలం, ఆయనకు స్వామి దర్శనాన్ని అనుగ్రహించిన స్థలం. అక్కడి నుంచి గంగాయికొండ చోళపురం లో బృహదీశ్వర స్వామిని చూసి తరించాం. తంజావూరు లోని బృహదీశ్వర స్వామి ఆలయం అచుగుద్దినట్టు ఇలాగే ఉంటుందంట, చూడబోయే ఆలయాన్ని, ముందుగానే చూసేసాం కదూ. కుంభకోణం చేరుకొని, భోజనం చేసి, సారంగపాణి ఆలయంలో కాసేపు నడుం వాల్చాము. అక్కడి శిల్ప సౌందర్యం, ప్రశాంతత మనుషులని, మనసులని కట్టిపడేస్తుంది. స్వామిని చక్కగా దర్శించుకొని, పక్కనే ఉన్న సోమేశ్వర స్వామిని, నాగేశ్వర స్వామిని చూసి వచ్చాం. అక్కడినుంచి, స్వామిమలై లో సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా దర్శించుకున్నాం. ఆరు మురుగన్ ఆలయాల్లో ఇది రెండవది. స్వామి దగ్గరే చాలాసేపు ఉండి, పూజారి వెళ్ళమని కసిరేసాకా, తృప్తిగా తిరిగి వచ్చాం. అక్కడి నుంచి, గజేంద్ర వరద పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నాం. ఈ దివ్యదేశం, పంచ కన్నన్ ఆలయాల్లో ఒకటి. అంతే కాదు, హనుమంతుడు స్వామిని పూజించిన కారణంగా, కపిస్థలం కూడా. తంజావూరు లో రాత్రి బస.
మరునాడు తెల్లవారి, తంజాయ్ మణికుండ్ర పెరుమాళ్ ఆలయానికి వెళ్లాం. వెళ్ళాకా తెలిసింది, పక్కపక్కనే ఉన్న, మూడు ఆలయాలు కలిపి ఒక దివ్యదేశం అని. నీలమేఘ పెరుమాళ్, నరసింహ పెరుమాళ్ ఆలయాలను చక్కగా దర్శించుకొని, ఆ పక్కనే ఉన్న, తంజాపురీశ్వర స్వామి ఆలయానికి వెళ్లాం. స్వామికి చక్కగా నమక చమకాలతో అభిషేకం జరుగుతోంది. కాసేపు ఆనందంగా వీక్షించి, బృహదీశ్వర స్వామి దగ్గరకి వెళ్లాం. ఆలయం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అందం, వైభవం, కళ, మహిమ - అన్నీ ఉన్నాయి ఆ గుడిలో. అంత పెద్ద శివలింగాన్ని చూస్తే చాలు, ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిది, ఆ స్వామికి పాలాభిషేకం చేస్తూంటే, చూసిన మా అదృష్టం ఏమని చెప్పను ? అక్కడినుంచి జంబుకేశ్వర స్వామి దగ్గరకి వెళ్లాం. జల లింగ దర్శనం అమోఘం. ఎంత సేపు ఉన్నామో, ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళామో... కొంచెం చీకటిగా ఉండటంవల్ల పూజారి గమనించలేదేమో గానీ, స్వామీ, నువ్వు చూస్తూనే ఉన్నావని మాకు తెలుసులే. అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాకా, స్వయంభూ వినాయక ఆలయానికి వెళ్లాం. రంగనాథస్వామిని శ్రీరంగం లో ప్రతిష్ఠించిన ఆ గణేషుడు, విభీషణుడి నుంచి తప్పించుకోడానికి ఈ కొండమీదకి పరుగెత్తి వచ్చాడంట. అక్కడే ఉన్న ఆ స్వామి తల్లితండ్రుల్ని కూడా చక్కగా చూసుకొని. రంగనాథుని ఆశీర్వాదంకోసం బయలుదేరి వెళ్లాం. ఎంత పెద్ద ఆలయం, ఎంత అందమైన కట్టడాలు, ఎంత అద్భుతమైన శిల్పసంపద - మాటల్లో వర్ణించడం, మన తరమా... చాలామంది భక్తులు ఉండటం వల్ల, స్వామి దగ్గర, ఎక్కువ సేపు ఉండనివ్వలేదు. తిరుమల లో జరిగినట్టుగా, లిప్త కాలం పాటు మాత్రమే స్వామి కనపడ్డారు. ఒకింత మనసు బాధపడింది. ఆయనకి తెలియంది ఏముంది, కాసేపటికి, మళ్ళీ దర్శనం క్యూ లోకి వెళ్లాం. అప్పటికే, రాత్రి 9 అయ్యింది, అందుకే, ఈ సారి ఎవరూ లేరు. హాయిగా, కాసేపు స్వామి దగ్గర ఉండి, చక్కటి దర్శనం చేసుకున్నాం. రాత్రి శ్రీరంగంలో బస.
తెల్లవారాకా, పుండరీకాక్ష స్వామి ఆలయానికి వెళ్లాం. శిబి చక్రవర్తిని అనుగ్రహించిన స్వామి, త్రేతా యుగ కాలంనాటి స్వామి, దివ్య దేశం, శ్రీరంగం కన్నా పురాతన ఆలయం - ఎన్నో విశేషాలుగల ఈ ఆలయ దర్శనం, మాకు దొరికిన మహద్భాగ్యం. అక్కడి నుంచి నమక్కల్ లో నరసింహ స్వామి ఆలయానికి వెళ్లాం. త్రిమూర్తి స్థలం అయిన ఈ ఆలయంలో నరసింహ స్వామికి రెండు వైపులా, బ్రహ్మ, శివ మూర్తులు, వారితో పాటు, సనక సనందులు ఉన్నారు. అక్కడే ఉన్న హనుమాన్ ఆలయంలో స్వామికి జరుగుతున్న అభిషేకం చూసాం. దగ్గరలో ఉన్న, రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. శేషతల్పం పైన ఉన్న స్వామిని కళ్లారా చూసి తరించాం. ఇక్కడి శేషతల్పం, ఆదిశేషుడు కాదు, సింహ ముఖంతో ఉన్న పడగలు కలిగిన కర్కోటకుడు.
ఎన్నో విశేషాలతో అలరారుతున్న ఈ అద్భుత క్షేత్రాలు చూసి వచ్చిన మా భాగ్యాన్ని, ఆ శివకేశవుల ఆశీర్వాదంగా భావించి ఆనందించాం. మళ్ళీ మళ్ళీ వారిదగ్గరకి వెళ్ళాలన్న తపన కలుగుతూనే ఉండాలని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి దర్శనాలు ఇప్పించమని వాళ్ళని కోరుకున్నాం.
బృహదీశ్వర స్వామి ఆలయంలో ...
Places visited:
23rd Jan
- Arunachalam - 3PM
- Virudhachalam - 5PM
- Srimushnam - 8PM
- Chidambaram - 8AM
- Veera Naarayana swamy - 10AM
- Gangaikonda - 11:30PM
- Kumbhakonam - 5PM
- Swami Malai - 6:30PM
- Gajendra Varada perumal - 7:30PM
- Neelamegha Perumal, Thanjapureeswarar - 7AM
- Thanjavur - 9AM
- Jambukeswarar - 3PM
- Srirangam - 5PM
- Pundareekakshan perumal - 8AM
- Namakkal - 11AM
Comments
Post a Comment