ఆత్మానుభూతి

 అనన్య భక్తి

భగవంతుడు సృష్టించిన పదార్ధాల తో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మన మనో పుష్పాన్ని భగవంతునికి  అర్పించటమే అనన్య భక్తి!

ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి.!

దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి. నిరంతరం తపన, సాధన చేయాలి. ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అన్న దాన్ని అనుభూతి పొందాలి.

విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మనలో, జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది. మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి.

మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి...      లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మలో ప్రతిష్టించాలి!. ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి! ఇదే అనన్య భక్తి, ఆత్మానుభూతి. గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ భక్తుడు కాలేడు.

చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు.ముక్తి పొందాలంటే భక్తి కావాలి.భక్తి అంటే అనన్య భక్తి కావాలి.సంపూర్ణ శరణాగతి. దీనికి చిత్త శుద్ధి, నిష్కామ కర్మలతో కూడిన నిరంతరం సాధన అవసరం.

ప్రతీ మానవునిలో 3 శరీరాలు ఉంటాయి... స్థుల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ కారణ శరీరంలోనే అనేక జన్మర్జిత పాపపుణ్యాలు బీజరూపం లో నిక్షిప్తం అయివుంటాయి... వీటి వల్లనే అనేక వికారాలు వస్తూ ఉంటాయి జీవుడికి.

పైవికారాలు తొలగించుకోవాలి అంటే సూక్ష్మ శరీరం లో మార్పు రావాలి. ఈ సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్థుల శరీరంతోనే  ఏ సాధన అయినా చేయాలి.

శరీరమాధ్యం  ఖలుధర్మ సాధనం!’ కాబట్టి.. ఈ శరీరం తోనే సాధన చేయాలి. ఇది లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న చందంగా.ఈ శరీరం ఉండగానే, చిత్త శుద్ధి తో, నిష్కామ కర్మలతో, అనన్య భక్తి తో, సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందాలి.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం