అయిదు ఇంద్రియములు

మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. 
కన్ను
కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.
చెవి
పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడు రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది.
చర్మము
చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడతాడు. ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.
నాలుక 
నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.
వాసన 
ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటి పడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ వున్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.
ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు.

కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట వుండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించి పోవడం అత్యంత ప్రమాదకరము.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం