లయం
జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ...