సుందరకాండ పారాయణం
చూసి రమ్మంటే కాల్చి వచ్చినవాడికి ఆ ధైర్యమెక్కడిది?
సుందరకాండ ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణా శాస్త్రం. ఎటువంటి కష్టాల్లో ఉన్న ఒక్కసారి పారాయణం చేస్తే దన్నుగా ఉండి ఆ పరిస్థితిని చక్కబరుస్తాడు మన భవిష్యద్ బ్రహ్మ. ఎవరికైనా ఒక సంఘటన జరిగింది అంటే దానికి ఎన్నో కారణాలు కలిసి ఆ స్థితిని కలుగచేస్తాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సంఘంలో మనం అందరమూ కర్మవశాత్తు అందరం ఒకళ్ళకు ఒకళ్ళు సంబంధం ఉన్నవారమే. మనం కేవలం మాటలు, చేతలతో మాత్రమే కాక ఆలోచనల ద్వారా ఒకరిని మరొకరు ప్రభావితం చెయ్యగలవాళ్లము, భావాలు వ్యక్తం చేసుకోగలిగే వాళ్లము. ఇది కొంచెం తాత్త్విక దృష్టి ఉన్నవాళ్ళకు నిత్య అనుభవైకవేద్యం. ఎన్నో సమస్యలకు మనకే సరైన ఆలోచన ప్రచోదనం అవ్వడం వలన పరిష్కారం దొరుకుతుంది. దాన్నే మనం సరస్వతీ కటాక్షం అని కూడా అంటూ ఉంటాము. ఒకొక్కసారి మనకు తెలియని శక్తి ఆ సమస్యకు కారణమైన వారి మనస్సును ప్రభావితం చేసి ఆ సమస్యను సరళం చేస్తూ ఉంటుంది. వీటికి అద్భుతంగా దోహదం చేసే అమూల్య సాధనం సుందరకాండ పారాయణ అని మనకు దైవజ్ఞులు, పెద్దలు చెప్పి ఉన్నదే, కొత్తగా మనం కనిపెట్టింది కాదు. ఎంతో దైన్యావస్థలో ఉన్నా కూడా సుందరకాండ చదవడం ద్వారా అక్కడ హనుమంతుల వారు కష్టాలు దాటిన వైనాన్ని వినడం ద్వారా నూతనోత్సాహం పొంది ఆయన మీద భారం వేసో, లేక తమ మీద నమ్మకం కుదిరో మరింత పట్టుదలతో ప్రయత్నం చెయ్యడం ద్వారా ఆ పనిని సఫలం చేసుకుంటూ ఉంటారు.
సుందరకాండ మనకు దొరికిన ఒక అమృతభాండం. దానిలో స్వామి హనుమ యొక్క అంతరంగం ఆవిష్కృతం అవుతుంది. ప్రతీ సంఘటనలో ఆయన అనుభవించిన ఆలోచనలను మనకు కళ్ళకు కట్టినట్టు చిత్రించి వాల్మీకి మహర్షి మానవాళికి ఎంతో మేలు చేసారు. వంద యోజనాలు దాటి దారిలో మైనాక పర్వత ఆశీర్వాదం తీసుకుని సురసను తన సూక్ష్మబుద్ధితో మెప్పించి, సింహికను దునుమాడి, చివరగా లంకిణిని మట్టి కరిపించి లంకలో అడుగుపెట్టిన మారుతి కనబడ్డ భవనాలు అన్నీ దాటి ఎక్కడా సీతమ్మ జాడ కానరాక ఎంతో నిరాశానిస్పృహలకు లోనయ్యారు. సీతమ్మ జాడను కన్నుక్కోలేని తాను అసలు వెనక్కు వెళ్ళక అక్కడే ప్రాయోపవేశం చేసో లేక ఆత్మహత్యో చేసుకుని అవమానం నుండి తప్పుకోవడానికి ఉద్యుక్తుడై మరల బ్రతికి ఉంటె ఎప్పటికైనా తప్పక మంచి జరుగుతుందని తనకు తాను సమాధాన పడి, ఉత్సాహంగా ఉండడం వలన మాత్రమె మంచి జరుగుతుంది అని తనకు తాను ప్రబోధం చేసుకుంటూ మనల్ని కూడా ప్రభావితులను చేస్తారు స్వామి హనుమ. అటువంటి ఆయనకు అంతకు ముందు తాను వెదకని అశోకవని కనిపించి రెట్టించిన ఉత్సాహంతో అక్కడ అమ్మవారిని కనుగొంటాడు.
రావణుడు నోటికి వచ్చినది మాట్లాడి వెళ్ళాక, అక్కడున్న రాక్షసుల మాటలు వినలేక ఎంతో రోదిస్తున్న సీతమ్మను అసలు తాను కలవాలో లేక ఈ విషయం ఉన్నదున్నట్టు శ్రీరామునికి నివేదించాలో అన్న విషయం హనుమ ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు. అప్పటి ఆయన మానసిక పరిస్థితిని బట్టి తప్పక అమ్మవారికి ధైర్యం చెప్పాలి, అదీ ఎవరికీ కనబడకుండా, రాముడు వచ్చేంతవరకు ఆవిడ ధైర్యంగా ఉండాలి అని కృతనిశ్చయుడు అవుతాడు. కానీ ఆయన అందరి ముందుకు తాను కనబడడానికి జంకుతాడు. తాను కనుక వారి కంట బడితే వారు ఆయనను చంపవచ్చేమో అని, లేదా వారితో యుద్ధం చెయ్యడం వలన తనకున్న శక్తి తగ్గి మరల వెనక్కు వెళ్ళగలనో లేనో అని తనమీద అపనమ్మకంతో ఉంటాడు. లేదా తన వలన సీతమ్మకు మరిన్ని కష్టాలు కలుగుతాయేమో అని భయపడతాడు. అందువలన సూక్ష్మరూపంతో రామాయణ గానం చేసి రాక్షసులకు కంటబడకుండా అమ్మవారితో సంభాషిస్తాడు. అమ్మవారికి ధైర్యం చెప్పి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాక ఒక్కసారి ఆయనకు ఎక్కడ లేని శక్తి కలిసి వస్తుంది. అంతకు ముందు ఆయన వద్ద ఆ శక్తి లేదా అంటే తప్పక ఉంది, కానీ అమ్మ వారి దర్శనం అయ్యాక ఆవిడ ఆశీర్వాదం అందినాక తన బలం మీద తన స్థైర్యం మీద ఆయనకు అపారమైన నమ్మకం కలిగింది. ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. శక్తి రూపిణి సీతమ్మ స్వామి హనుమలో శక్తిని ప్రచోదనం చేసింది.
అమ్మవారిని కలిసాక హనుమంతుల వారి ఆలోచనాసరళి మొత్తం మారిపోయింది. కేవలం సీతమ్మ జాడ మాత్రమె కనుక్కుని రమ్మని పంపితే, అసలు ఈ రావణుని బలాబలాలు ఏమిటో తెలుసుకోవాలని, వారికి తన బలం ద్వారా ఒక హెచ్చరిక చెయ్యాలని తద్వారా వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలని తనకు ఏమీ కాదన్న నమ్మకంతో వనాన్ని ధ్వంసం చెయ్యడం ద్వారా రావణునిలో కదలిక తెప్పించాడు. లక్షమంది సైన్యాన్ని,మంత్రులను, సైనికాధికారులను, మంత్రికుమారులను మాత్రమే కాక స్వయంగా రావణుని ముద్దుల కొడుకు అక్షకుమారుడిని నుజ్జునుజ్జు చేసాడు. బుద్ధిపూర్వకంగా తనను ఏమీ చెయ్యని ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి వెళ్లి రావణునికి బుద్ధి చెప్పి, తన తోకకు నిప్పటించిన వాళ్ళ అందరి ఇళ్ళను కాల్చి వచ్చి అమ్మవారిని తిరిగి దర్శించుకుని ఒక్క ఉదుటున తన వారిదగ్గరకు వెళ్ళాడు స్వామి.
మరి అమ్మవారిని కలవక ముందు అదే రాక్షసులకు కంటబడితే స్వామికార్యం నిష్పలం చేసిన వాడను అవుతాను అని అనుకున్న ఆయన రావణునితో సహా దాదాపు లంకలో అందరినీ భయపెట్టి వెళ్ళగలిగిన ఆయన తెగువకు కారణం కేవలం అమ్మవారి దర్శనం. అందులోను ఆయన అమ్మవారిని ఎలా దర్శించాడు, రామునికి సీతకు అభేధంగా దర్శించాడు, అందులో సీతమ్మ చెప్పిన ఘట్టాలలో రాముడు వర్ణించిన ఐదు తలల పాము వంటి అమ్మవారిని సాక్షాత్తు జగత్తును నడిపించే గాయత్రీమాతగా దర్శించాడు. అమ్మవారి చూడామణి అందుకున్న ఆయనకు అమ్మవారి రక్షణకవచం దొరికింది, అయ్యవారి ఆశీర్వాదం ఉండనే ఉంది. ఇక తనకేమి ఎదురు అని తన బలం మీద తన బలం కన్నా తనకున్న ఆశీర్వాద బలంమీద రెట్టించిన నమ్మకంతో లంకను ఒక పట్టు పట్టి వచ్చాడు. ఈ ఘట్టాలను చదివిన వారికి అమ్మవారి ఆశీర్వాదం దొరికి ఎటువంటి కష్టమైనా సమస్య అయినా సరే, మనకు బుద్ధి ప్రచోదనం చెయ్యడం వలన కొన్ని, మిగిలిన వారి బుద్ధిని నియంత్రించడం వలన కొన్ని, పరిస్థితులను చక్కదిద్ది కొన్ని ఆ అమ్మవారే మనకున్న సమస్యలను తొలగిస్తుంది. హనుమంతుడు గురువుగా మనకు ఆయన ప్రయాణం సుందరంగా చెబుతూ సమస్యలను తీర్చి మన బ్రతుకులను సుందరంగా దిద్ది అందించే సుందర సాధనం సుందరకాండ. మనకు సమయం వస్తే కానీ సుందరకాండ చదవాలనే బుద్ధి కూడా పుట్టదు. మనకు ఎల్లప్పుడూ రక్షగా నిలిచి మన బుద్ధిని మంచికి ప్రచోదనం చేసే హనుమంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉండాలని ప్రార్ధిస్తూ !!!
Comments
Post a Comment