శృంగేరి-ఉడుపి

బెంగుళూరు వచ్చిననుంచీ, ఎన్నో అందమైన ఆలయాలు, అద్భుతమైన దర్శనాలు దొరుకుతున్నాయి, ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేసి, 1000 కిమీ దాటి కారులో పెద్ద ప్రయాణమే చేసి వచ్చాం.  క్రిస్మస్ సెలవులని బాగా ఉపయోగించుకున్నాం.

శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి,  సకలేష్ పుర చేరుకున్నాం.  సకలేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ ఊళ్ళోనే రాత్రికి బస చేసాం.  2000 సంవత్సరములనాటి ఆ ఆలయానికి మళ్ళీ ఉదయాన్నే ఇంకొకసారి వెళ్లి, స్వామిని చూసుకొని కుక్షి సుబ్రహ్మణ్యం చేరుకున్నాం.  ఆది సుబ్రహ్మణ్య స్వామి, కుక్షి సుబ్రహ్మణ్యస్వామి దర్శనాలు చక్కగా అయ్యాయి.  అక్కడనుంచి ధర్మస్థల కి మా ప్రయాణం.  మంజునాథస్వామి దర్శనానికి, పుంఖానుపుంఖాలుగా జన సందోహం వచ్చేసింది.   Special దర్శనం టిక్కెట్లు కొనుక్కొని, 4 గంటలు పైగా క్యూలో వేచి, చివరకు స్వామిని చూడగలిగాం.  అమ్మవారిని కూడా దర్శించుకొని, దేవస్థానంవారు పెట్టిన భోజనం చేసి, 8PM కి హొరనాడు చేరుకున్నాం.  అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం చక్కగా అయింది.  రాత్రి అక్కడే బస.

తెల్లారి లేస్తూనే, శృంగగిరి (శృంగేరి) కి బయలుదేరాం.  ఆదిశంకరులు నడయాడిన ఆ పవిత్ర స్థలంలో, మేము కూడా కాలు పెట్టాం.  శారదాంబ అమ్మవారిని, శివాలయాన్ని దర్శించుకొన్నాం.  అక్కడనుంచి కిగ్గ అనే ఊరిలో ఉన్న ఋష్య శృంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం.  నమక చమకములతో స్వామి అభిషేకాన్ని ఆనందంగా తిలకించి, శాంతాదేవి కి కూడా వందనాలు అర్పించి, తిరిగి శృంగేరి చేరుకున్నాం.  భోజనం శారదాపీఠం లోనే.  అక్కడనుంచి, ఉడుపి బయలుదేరాం.  త్రోవలో పేడూరు లో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించి, ఉడుపి లో చిన్ని కృష్ణుని ఆలయానికి చేరుకున్నాం.  నవగ్రహ కిటికీ లోంచి, స్వామిని చక్కగా చూసుకొని, అక్కడనుంచి బయలుదేరి జనార్ధన-మహాకాళి ఆలయ దర్శనం చేసుకున్నాం.  ఇక ప్రయాణం, మంగుళూరు కి.  త్రోవలో కావూరు లో మహాలింగేశ్వర స్వామి అభిషేకం కళ్లారా చూసి తరించాం.  అక్కడినుంచి కుడుపు లో వేంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామివారిని దర్శించుకొని, మంగుళూరు చేరుకున్నాం.  కద్రి మంజునాథస్వామి దేవస్థానంవారి బసలో రాత్రి పడుకున్నాం.

పెందలకడనే లేచి కద్రి మంజునాథస్వామివారి దర్శనం చేసుకున్నాం.  అక్కడనుంచి మంగళాదేవి ఆలయానికి వెళ్లి, అమ్మవారి ఆలయంలో చాలా సేపు గడిపాం.  అక్కడినుంచి సుదీర్ఘ ప్రయాణం, బేలూరు చెన్నకేశవ ఆలయానికి.   స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చాలా సేపు కళ్లారా చూసుకొని, దేవస్థానంవారి భోజనం చేసి, హలెబీడు లో హొయసాలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాం.  కళ్ళవిందుగా, అద్భుతమైన ఆలయాన్ని, శిల్ప సౌందర్యాన్ని తిలకించి, అక్కడినుంచి మూడిగెరె శ్రీ యోగ నరసింహస్వామి ఆలయానికి వెళ్లాం.  స్వామిని ఎంతసేపు చూసినా తనివితీరదు, అంత అందమైన ఆలయం అది.  స్వామికి ఎదురుగా, భూ వరాహ స్వామివారు కూడా ఉన్నారు.  పక్కనేవున్న, ఓంకారేశ్వర స్వామి ఆలయం కూడా సందర్శించుకొని, ఆనందంగా ఇల్లు చేరుకున్నాం.

ఋష్య శృంగేశ్వర స్వామి ఆలయంలో ఒక మధుర జ్ఞ్యాపకం

చాగంటివారి ప్రవచనాలు వింటూ సాగిన ఈ నాలుగురోజుల ప్రయాణం, ఎన్నో మధుర జ్ఞ్యాపకాలను మిగిల్చింది.  చాలామట్టుకు ఆలయాల్లో, మగవాళ్ళు షర్టు, బనీను తీసి దర్శనానికి వెళ్ళాలి.  పంచ కట్టుకొని వెళ్లడం శ్రేష్టం.  అలాగే, ప్రతీదగ్గరా, సేవా టిక్కెట్టు తీసుకొని, సేవల్లో పాలుపంచుకునే అవకాశం ఉంది.

Places visited:
https://goo.gl/maps/ezqQKqSpoH52

సకలేశ్వర స్వామి - సకలేష్ పుర - 22nd Dec 8PM, 23rd Dec 6AM

కుక్షి సుబ్రహ్మణ్యం - సుబ్రహ్మణ్యం - 23rd Dec 9AM
మంజునాథస్వామి - ధర్మస్థల - 23rd Dec 4PM
అన్నపూర్ణేశ్వరి దేవి - హొరనాడు -  23rd Dec 9PM

శారదాపీఠం - శృంగేరి - 24th Dec 10AM
ఋష్య శృంగేశ్వర స్వామి - కిగ్గ - 24th Dec 12Noon
అనంత పద్మనాభస్వామి - పేడూరు - 24th Dec 4PM
శ్రీ కృష్ణ మఠ్ - ఉడుపి - 6PM
జనార్ధన-మహాకాళి - ఉడుపి - 6:30PM

కద్రి మంజునాథస్వామి - మంగుళూరు - 6AM
మంగళాదేవి -  మంగుళూరు - 7:30AM
చెన్నకేశవస్వామి - బేలూరు - 2PM
హొయసాలేశ్వర స్వామి - హలెబీడు - 4PM
శ్రీ యోగ నరసింహస్వామి - మూడిగెరె - 6PM
 ఓంకారేశ్వర స్వామి - మూడిగెరె - 6:30PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం