అయ్యప్ప దర్శనం

 ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ వైభోగం !!!  ఎలా అయితేనేం, అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చాను.  స్వామిని కళ్లారా దర్శించుకోగలిగాను.  విపరీతమైన రద్దీలో కూడా ప్రశాంతమైన దర్శనం ప్రసాదించాడు, ఆ హరిహర పుత్రుడు.  ఇన్ని రోజులకు దొరికిన అదృష్టం కొద్దీ, శబరిమల ఎక్కుతూ శరణుఘోష వినగలిగాను.  అంత పెద్ద కొండపై, ఇంకా పెద్ద గుడిలో, చిన్ని విగ్రహం ఇంకా కళ్ళ ముందే ఉంది సుమా.  ఇంతమంది స్వామిమాల ఎందుకు వేసుకుంటారు, ఇంత కఠినమైన నియమాలని ఎలా పాటిస్తారు, నఖ-శిఖ పర్యంతం పవిత్రతని ఎలా కాపాడుకుంటారు, మనసుకి మలినాలు అంటకుండా ఎలా మండలదీక్ష చేస్తారు - ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఎప్పటినుంచో రగులుతున్నవే.  అదేమిటో విచిత్రం, అన్నిటికీ సమాధానం మాత్రం, అయ్యప్పని దర్శనంతో దొరికినట్టే అనిపించింది.  స్వామిని తన్మయత్వంతో ఆపాదమస్తకం కళ్ళతో జుర్రేస్తూ ఉంటే, ఎవరో భక్తుడు విసిరిన మొక్కుబడి మూట, నా ముక్కుకి తగిలి వాచింది.  "ఇన్నాళ్లు రాకుండా ఆలస్యం చేసావేం రా" అని స్వామి ముద్దుగా మందలించాడేమో.

ఉదయాన్నే,  చంగనూరు లో రైలు దిగి, పంబ వరకూ బస్సులో వెళ్లాం.  అక్కడ  పంపానది  లో స్నానం చేసి, శబరిమల కొండ ఎక్కిన మాకు, వేలాదిగా స్వాములు దారిపొడుగునా కనబడుతూనే ఉన్నారు.  సుమారుగా 5-6 కిమీ ఎక్కిన తరువాత, మధ్యాహ్నం 4 వరకూ దర్శన వేళ కోసం క్యూ లో ఎదురుచూశాం.  సుమారుగా 5-5:30 మధ్యలో రెండు సార్లు దర్శనం ప్రసాదించాడు, స్వామి.   ఆ ఆనందంలో కొండ చాలా త్వరగా దిగేసాం.  వర్షం పడటం వల్ల దిగడం కొంచెం కష్టం అనిపించినా, ఆగకుండా వచ్చేసాం.   మరలా పంబ నుంచి కొట్టాయం వరకూ బస్సు లో వెళ్లి అక్కడ నుంచి త్రిసూర్ కి రైలు లో వెళ్లాం.  తెల్లవారుఝామున 3:30 ప్రాంతంలో హోటల్  తీసుకొని, కాసేపు నడుములు చేరవేసాం.  9 గంటలకి మరలా బస్సులో గురువాయూర్ చేరుకున్నాం.

గురువాయూర్ లో ఇసుక వేస్తే రాలనంత భక్త జనం.  ఎంత పెద్ద కోవెల !!! ఎంత అందమైన కట్టడాలు !!!  ఎంత రమ్యమైన శిల్పాలు !!! గురువాయూరప్పన్ దర్శన భాగ్యం దొరికింది. ఆయనకు సరిగ్గా అభిషేకం అవుతూ ఉండగా చూడగలిగిన మా కళ్ళు అదృష్టం చేసుకున్నాయి కదూ.  కోవెలలో ప్రదక్షిణాలు చేసే వాళ్ళు, పొర్లు దండాలు పెట్టేవాళ్ళు, కాళ్లలో కాళ్ళు వేసుకుంటూ ప్రదక్షిణం చేసేవాళ్ళు, అయ్యప్పదీక్ష తీసుకొని శబరిమల బయలుదేరేవాళ్ళు - ఒకరేమిటి, వర్ణించనలవి కాదు, ఆ వైభవం.  గురువాయూరప్పన్ దర్శనం తరువాత, 3కిమీ దూరంలో ఉన్న మమ్మియూర్ మహాదేవ ఆలయంలో శివయ్యను చూసాం.  ఎంత అందంగా అలంకరించారో మాటల్లో చెప్పలేను.  ఈయనను కూడా చూస్తే, గురువాయూర్ యాత్ర పరిపూర్ణం అని గూగుల్ లో చదివా.

అక్కడినుంచి తిరిగి త్రిసూర్ వచ్చేసాం.  వడక్కునాథన్ ఆలయానికి వెళ్లి,  శివయ్య వైభవానికి, ప్రభావానికి, లీలలకి మరొకసారి పడిపోయా.  ఎప్పుడు కలుస్తానో ఇంకా  తెలియదుగానీ, "ఇంకా ఎంతకాలం ఈ ఎడబాటు స్వామీ" అని గట్టిగా అడిగేస్తా.  నా పిచ్చిగానీ, నాలోనే ఉన్నోడిని ఎప్పుడైనా అడగొచ్చు కదా.  కానీ, నాలోనే ఉన్నోడిని ఎలా కలుసుకోవడం ? అంత: ప్రయాణం ఎలా చెయ్యాలి ? ఎన్నాళ్ళు చెయ్యాలి ? ఎంత  దూరం చెయ్యాలి ? ఎప్పటికి కలుస్తాడో !!!

శబరిమల ఆలయ ప్రాంగణంలో...


Places visited:
30th Nov 5PM -  శబరిమల, అయ్యప్పస్వామి
1st Dec 10AM - గురువాయూరప్పన్, గురువాయూర్
1st Dec 11AM - మమ్మియూర్ మహాదేవ ఆలయం, గురువాయూర్
1st Dec 5PM - వడక్కునాథన్ ఆలయం, త్రిసూర్

Comments

  1. ఒక అయ్యప్ప స్వామి కొండకు పోయి తనను తనే దర్శనం చేసుకున్నాడు l.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం