మదురై - రామేశ్వరం

ఏమి నా భాగ్యం.. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు వెళ్లాలని ప్రణాళికలు కూడా వేసుకున్నా, కుదరక వెళ్లలేకపోయిన అద్భుత ఆలయమాలల  సందర్శనాభాగ్యం ఎట్టకేలకు దొరికింది.  ఎన్ని క్షేత్రాలు, ఎన్ని అద్భుత దర్శనాలు, ఎంత ఆనందం, ఏమి పారవశ్యం !!!  మదురై మరియు రామేశ్వరం - రెండు ప్రదేశాలలో శివయ్య రెండు చేతులతో హత్తుకొని లోనికి రమ్మని పిలిచినట్టు ఎంత చక్కటి దర్శనాలు !!!

తిరుచెంగోడు లో స్వయంభూ గా వెలసిన అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకున్నాం.  మార్గశిరమాసంలో ఉదయం 7 వరకూ, మరకతలింగ దర్శనం కూడా ఉంటుంది, అదృష్టవశాత్తూ ఆ దర్శన భాగ్యం కూడా దక్కింది.  ఇదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంభూ గా వెలిసాడు.  ఆయనని కూడా చక్కగా దర్శించుకొని ప్రయాణం కొనసాగించాం.  మదురై దగ్గరలో అళగర్ కొండమీద ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎంతో బాగుంది.  చక్కగా స్వామి ముందు రెండు నిముషాలు కూర్చోనిచ్చి పంపించారు.  ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.   దర్శనం చేసుకొని వచ్చేసరికి కొండ దిగువన ఉన్న పెరుమాళ్ ఆలయం తెరిచిలేదు.  అక్కడినుంచి ఇంకొక సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్లాం, ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో రెండవది.  గణపతి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి పక్కపక్కనే ఉన్నారు, చక్కగా దర్శనం అయింది.  అక్కడనుంచి మీనాక్షి అమ్మ దగ్గరకి ప్రయాణం.  భక్తజనం పోటెత్తి ఉన్నారు, అయినా దర్శనం మాత్రం అద్భుతం.  సుందరేశ్వరుడు ఎంతో సుందరంగా ఉన్నాడు. ఈ ఆలయానికి వెనుకవైపు, పెరుమాళ్ ఆలయం ఉంది.  ఇది 108 దివ్యదేశాలలో ఒకటి.  స్వామి మరియు అమ్మవారి దర్శనం చేసుకుని, అక్కడినుంచి శ్రీవిల్లిపుత్తూర్ వెళ్లి రాత్రి బస చేసాం.

తెల్లారి లేస్తూనే, వైద్యనాథ స్వామిని దర్శించుకొని, ఆండాళ్ అమ్మవారి ఆలయానికి వెళ్లాం.  ఆచారిగారు, స్థల పురాణాన్ని చక్కగా వివరించారు.  రంగనాథ స్వామి, ఆండాళ్ అమ్మవారు వెలసిన ఈ ఆలయంలో, గరుడాళ్వార్ వారి ఇద్దరి పక్కన వెలిశారు.  ఇలా గరుడు స్వామితో పాటూ గర్భగుడిలో వెలసిన ఒకేఒక ఆలయం ఇది.  చక్కని శివకేశవుల దర్శనాల తరువాత, రామేశ్వరం బయలుదేరాం.  త్రోవలో చొక్కనాథ స్వామి ఆలయం, భూమినాథ స్వామి ఆలయం చూసాం.  రామేశ్వరంలో సముద్రస్నానం, 22 బావులస్నానం - రెండూ చక్కగా అయ్యాయి.  రామనాథస్వామి, పర్వతవర్ధిని అమ్మవారు - ఇద్దరినీ కళ్లారా దర్శించి పరవశించిపోయాం.  ఎన్నినాళ్ళకు స్వామివారికి కరుణ కలిగింది.  శివాజ్ఞ అయ్యింది, శివదర్శన భాగ్యం దొరికింది.  రాత్రాంతా రామనాథస్వామి కళ్ళముందు కనబడుతూ ఉంటే, ఎప్పుడు పడుకున్నామో తెలియదు.

తెల్లవారుఝామున, 2:30 కి వెళ్లి స్ఫటిక లింగ దర్శనం కోసం వరుసలో నిల్చున్నాం.  శంకరాచార్యుల వారి ద్వారా రామేశ్వరంలో ప్రవేశపెట్టబడిన స్ఫటిక లింగ దర్శనం చక్కగా అయ్యింది.  అదృష్టంకొద్దీ, మేము చూస్తూ ఉండగానే స్ఫటిక లింగానికి పాలతో, నీటితో అభిషేకం చేశారు, లింగం ఇంకా ప్రస్ఫూటంగా కనపడింది.  ఎంతో తృప్తితో అక్కడినుంచి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లాం.  రాముడు, ఈ స్వామిని ప్రార్ధించి ఆయుధాలు పొందాడట.  రావణవధ తరువాత తిరిగివచ్చి స్వామిని దర్శించుకున్నాడట.  రాముడికే కాదు, మాకు కూడా ఈ భాగ్యం దక్కింది.  అక్కడినుంచి పళని ప్రయాణమయ్యాము.  త్రోవలో, మంగళనాథస్వామిని దర్శించుకున్నాం.  అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో పచ్చ (ఎమరాల్డ్) తో తయారుచేయబడిన నటరాజ స్వామి విగ్రహం ఒక అద్భుతం.  పళనిలో ఎంత మంది భక్తులు!!  దర్శనం ఎలా అవుతుందో అని బెంగపెట్టుకున్నాం.  కానీ, ఆయన తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది, హాయిగా ఆనందంగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని తిరుగుప్రయాణమయ్యాం.  శివకేశవుల దర్శనాలు, సుబ్రహ్మణ్యుని క్షేత్ర సందర్శనాలు - ఈ ప్రయాణాన్ని విశేషంగా మార్చేశాయి.

రామేశ్వరం గోపురం వద్ద...


Places visited:

Arthanareeswarar and Chenkottu Velavar Murugan - Tiruchengode

Pazhamuthircholai Murugan - Alagar hills, Madurai

Subramaniya swamy - Thiruparankundram, Madurai

Meenakshi Amman - Madurai

Koodal Azhagar Divyadesam - Madurai

Andal sametha rangamannar - Srivilliputtur

Vaidyanatha swamy - Srivilliputtur

Meenakshi Chokkanatha Swamy - Aruppukottai

Bhuminathaswamy - Tiruchuli

Ramanathar Swamy - Rameshwaram

Adhi Jagannatha Perumal Divyadesam - Thiruppalani

Mangalanatha Swamy - Utrakosamangai

Dhandayuthapani Swamy - Palani

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం