అహోబిలం & మహానంది

ఎంతటి ప్రేమ... అంతటా ఉన్నావని అంతా అంటున్నా, అంతులేని ప్రపంచమంతా నిన్నుగూర్చి వెతికే మా అజ్ఞానానికి నవ్వుకోక, 'వెర్రివాళ్ళు నాకోసమేకదా వెతుకుతున్నార'ని నీ అద్భుత దర్శనాలను ప్రసాదించేంత  ప్రేమ. 
ఎంతటి దయ... ధ్యాన దానాది సత్కర్మలను సరిగా ఆచరించక, నీ దర్శనం మాత్రమే పుణ్యమనుకొనే మాబోటి వాళ్ళ మూఢత్వానికి కోపించక, 'ఎప్పటికైనా తెలుసుకొంటారులే' అని జాలితో దీవించేంత దయ. 
ఎంతటి కరుణ...  నీకోసం వచ్చే చిన్ని ఆలోచనని ధ్యాసగా,  ధ్యాసని ఇష్టంగా,  ఇష్టాన్ని భక్తిగా, భక్తిని ప్రేమగా...  నీవే భావించుకొని 'నీకేంకావాలో తీసుకోరా' అని కరుణించేంత కరుణ.

ఉత్తరద్వార దర్శనంతో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి, ఆద్యంతం అద్భుతంగా సాగింది.  నవ నారసింహులలో ఎనిమిది ఆలయాలని ఈ రోజు చూసాం. ఒక్కో ఆలయం, ఒకటికి మించి ఒకటి... ఒక్కో దర్శనం, ఒకటితో సరిపోలినది ఒకటి... ఒక్కో విగ్రహం,  ఒకటి కాదు, సహస్ర విగ్రహాలకు సమానం. 
శివ కేశవులకు అభేదం కదూ.. అందుకే, నరసింహస్వామిని 'నా మదిలో శివుడిని నిలపమని' అడిగా.  మహాలక్ష్మి దగ్గర 'శివయ్య ధ్యాన ధనం' కోరుకున్నా.  ఉగ్ర స్థంభం పైకి రుద్ర జపం చేస్తూ వెళ్ళా.  అంత అద్భుతమైన నారసింహ దర్శనాలు, ఇంకోసారి ఋజువు చేశాయి, వారిద్దరూ ఒకటే, తేడా అంతా మన ఆలోచనలోనే అని.  ఈ ఆనందం అంతా నిండుగా ఉండటం వల్ల, భోజనం చేసేసరికి నడవడం కష్టమైంది - కడుపు, మనసు రెండూ నిండిపోతే అంతేగా, అంతేగా...

తరువాత రోజు, నల్లమల అడవుల్లో నడుస్తూ, నవ నారసింహులలో పావన నరసింహస్వామిని, చెంచులక్మిని దర్శించుకున్నాం.  అక్కడినుంచి నవ నందులను చూడటానికి బయలుదేరాం.   మా అదృష్టం ఏమని చెప్పను, స్వయంభూ లింగాలకు తల తాకించి, అభిషేకించి, పరవశించాం.  నందీశ్వరులను చూసి, తాకి, మా మనసులు తాండవం చేశాయి.  మరునాడు స్వామి దర్శనంతో, అభిషేకంతో ప్రారంభమైన రోజు, అది ఎంత బాగుంటుందో వేరే చెప్పాలా?  మిగిలిన మూడు నందులను కళ్లారా దర్శించాం.  అక్కడనుంచి యాగంటిలో ఉమామహేశ్వర స్వామిని, వేంకటేశ్వర స్వామిని దగ్గరగా చూసి పరవశించాం.  మూడేళ్ళ క్రితం చూసిన యాగంటి బసవన్న, ఈపాటికి కొంచెం పెరిగాడేమో అని ఆశగా చూసిన మా అమాయకపు చూపులను, ఆయన గమనించకపోడు.  అక్కడినుంచి మద్దిలేటి నరసింహ స్వామిని దర్శించుకున్నాం.  

నవ నారసింహులు - కారంజ, అహోబిల, వరాహ, జ్వాల, మాలోల, చత్రవట, యోగానంద, భార్గవ, పావన
నవ నందులు - సూర్య, శివ, విష్ణు, గరుడ, మహానంది, వినాయక, సోమ, నాగ, ప్రమథ
(మేము దర్శించిన వరుసలో)

పావన నరసింహుని దర్శన గర్వం మా కళ్ళల్లో కనపడుతోంది కదూ... 


Places visited:
నవ నారసింహులు - 25th Dec
ఉగ్ర స్థంభం - 25th Dec - 1PM
పావన నరసింహస్వామి - 26th Dec - 12 noon
నవ నందులు - 26th Dec evening (సూర్య, శివ, విష్ణు, గరుడ, మహానంది, వినాయక)
నవ నందులు - 27th Dec morning (సోమ, నాగ, ప్రమథ)
సోమేశ్వర స్వామి, గోస్పాడు - 27th Dec 11AM
ఉమామహేశ్వర స్వామి, వేంకటేశ్వర స్వామి, యాగంటి - 27th Dec 1PM
మద్దిలేటి నరసింహ స్వామి - 27th Dec 3PM

Comments

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం