జీవన కాలమ్

*గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట.* 

*అప్పారావు గారు వైద్యుడిని చూసి.. ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట.* 

*వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు.*

*మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.*

*ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ‘ఏం కావా’లని.* 

*’ఓ పెగ్గు స్కాచ్ కావాల’న్నారట ఆమె.*

 *ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.*

*చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ‘ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.*

*మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం.*

*మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత.*

*భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ఏదో ఒకనాడు వెళ్లిపోక తప్పదని.*

*కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు. కొందరు బెంబేలు పడతారు. కొందరు బేల అవుతారు.*

 *ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్దర్ ఆష్‌కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎలాగంటే.. 1983లో గుండెకి శస్త్రచికిత్స జరిగినప్పుడు, శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా, ఈ వ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమవుతోంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు: “ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్నే ఎందుకు గురిచేయాలి?”అని.*

*దీనికి ఆర్దర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు:*
*”ఈ ప్రపంచంలో,   5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి, టెన్నిస్ వంటబట్టింది. 5 లక్షల మంది ప్రొఫెషనల్‌గా టెన్నిస్‌ని ఆడగలుగుతున్నారు. 50 వేల మంది టెన్నిస్ పోటీ టోర్నమెంట్‌లలో ఆడుతున్నారు. 50 మంది మాత్రమే వింబుల్డన్ స్థాయికి వచ్చారు. నలుగురే సెమీ ఫైనల్స్‌కి వచ్చారు. ఇద్దరే ఫైనల్స్‌కి వచ్చారు. నేను చాంపియన్‌షిప్‌ని సాధించి, వింబుల్డన్ కప్పుని గెలిచి, చేత్తో పట్టుకున్నప్పుడు - నేను దేవుడిని అడగలేదు.  ‘ఎందుకయ్యా నన్నొక్కడినీ ఎంపిక చేశావు?’ అని.*

*ఇప్పుడు కష్టంలో ఉండి ‘నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు? అని దేవుడిని అడిగే హక్కు నాకేముంది?’*

 *ఆకెళ్ల అచ్యుతరామమ్ గారు రైల్వేలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రామాయణాన్ని ‘రగడ’ వృత్తంలో రాశారు. ఆదిశంకరుల రచనల్ని, త్యాగరాజ భక్తి తత్వాన్ని రచనల ద్వారా నిరూపించారు. 1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్‌లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన. శుభకార్యానికి, తెల్లవారుఝామున ఒక బాచ్‌ని దింపి ఇంటికి వస్తున్నారు. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న, పురాతన ఆంజనేయస్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి, పార్కింగు దీపాలు వెలిగించి,  కారు తాళం చెవులు జేబులో వేసుకుని, స్టీరింగు మీద తల ఆనించి వెళ్లిపోయారు. రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర.*

 *ఒక విచిత్రమైన సంఘటన. మా వియ్యపురాలి తండ్రిగారు దాదాపు 69 ఏళ్ల కిందట - విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు.* 

*విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగళాలో ఉండేవారు. చల్లా వెంకటరత్నంగారు వారి తండ్రిగారు. రామభక్తుడు.* 

*శ్రీరామనవమి నవరాత్రులలో ఆయన పూజలు చేసి, ప్రవచనాలు చెప్పించేవారు.*

*ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు (అప్పట్లో వారు ఇరవయ్యవ పడిలో ఉండి ఉంటారు) రామాయణం చెప్తున్నారు.*

*ఉదయం కల్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం.* 

*జటాయువు నిర్యాణం గురించి, చెప్తున్నారు శాస్త్రిగారు. వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చుని వింటున్నారు. * 

*జటాయువు ‘రామా! రామా!’ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు_ అన్నారు శాస్త్రిగారు.*

*”జటా యువు వెళ్లిపోయాడా?”అన్నారు వెంకటరత్నంగారు.* 

 *అవునన్నారు శాస్త్రిగారు. అంతే. స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నంగారి తల వాలిపోయింది. వెళ్లిపోయారు.* 

*దాదాపు 21 ఏళ్ల కిందట మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి, మృత్యువు ఒక ముహూర్తం.*

 *చాలా మందికి మృత్యువు ఒక మజిలీ. కొందరికి ఆటవిడుపు.*

*మహాయోగులకి నిర్యాణం. కొందరికి ఐహికమైన ‘మోజు’లకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం.* 

 *కొందరు అదృష్టవంతులకు, మరో గమ్యానికి దాటే వంతెన.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం