తిరుపతి - శ్రీకాళహస్తి

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అని మనసు పాడుతూ ఉంటే, శ్రీకాళహస్తికి బయలుదేరాం.  త్రోవలో ఉన్న కొన్ని అద్భుతమైన ఆలయాలు దర్శించుకుంటూ వెళ్ళాం.  మొట్టమొదట విఘ్నేశ్వరుని దివ్య దర్శనం.  పక్కనే కౌండిన్య మహర్షి ప్రతిష్టించిన సోమేశ్వరుని కూడా దర్శించుకున్నాం.  గరుడ‌ ఆలయ దర్శనం చాలా బాగుంది.   ఎక్కడా ఇతః పూర్వం వినలేదు, కనలేదు.  అక్కడినుంచి ముళబాగిలు లో ఉన్న 10 అడుగుల అద్భుతమైన ఆంజనేయుని కళ్లారా చూసుకొని పలమనేరు బయలుదేరాం.  శ్రీకూర్మం, బళ్లారి తరువాత కూర్మావతారానికి ఆలయం పలమనేరు దగ్గర మాత్రమే ఉంది.  స్వామిని చక్కగా దర్శించుకున్నాం. కాణిపాకం చాలా ఏళ్ళ తరువాత వెళ్ళాం, చక్కని దర్శనం దొరికింది.  అగస్త్యేశ్వర స్వామి ఆలయం అపూర్వమైనది, అగస్త్యునికి స్వర్ణముఖి నదిలో దొరికిన అద్భుత లింగం, వెంకటేశ్వర స్వామి పద్మావతీ సమేతుడై వచ్చి కొలిచిన లింగం.  శ్రీకాళహస్తిలో రాత్రి బస.

మరునాడు తెల్లవారిఝామునే, జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామిని కనులపండుగగా దర్శించుకొన్నాం.  తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు, ఆయన కోసం, దేవేరులతో సహా వచ్చి, స్వయంభూ గా వెంకటేశ్వర స్వామి వెలసిన శ్రీ భూ సమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి, మా పూర్వజన్మ సుకృతం కొద్దీ వెళ్లగలిగాం.  ఎక్కడా లేనట్లుగా, వెంకన్నబాబు సుఖాసీనుడై కూర్చొని వెలిసాడు.  గుడిమల్లం వెళ్లిన ప్రతీసారీ ఒక అనిర్వచనీయ దివ్యానుభూతి,  పరశురామేశ్వర స్వామి దర్శనం, పరమ పావనం.  తిరుమల లో స్వామి ఎలా ఉంటారో, వికృతమాల లో స్వామి అచ్చంగా అలాగే ఉంటారు.  చక్కగా దర్శించుకొని, పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళుతూ ఉంటే, త్రోవలో ఆశ్చర్యంగా ద్రౌపదీ సమేత ధర్మరాజ ఆలయం కనబడింది.  ఆ మహాత్ములకి జోతలు చెప్పి, పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నాం.  ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే, "వినాయక ఆలయం" అని బోర్డు కనబడింది.  మా అబ్బాయి వెళదామని పట్టుపట్టి లోపలకి తీసుకు వెళ్ళాడు.  అక్కడ పూజారిగారు చెప్పింది విని ఆశ్చర్యపోయాం.  ఇప్పుడు ఆలయం ఉన్నచోట, పద్మావతి అమ్మవారి కోసం, వేంకటేశ్వర స్వామి 11 ఏళ్లపాటు తపస్సు చేసారంట.  స్వామి పెళ్ళికి పురోహితుడిగా వ్యవహరించిన విఘ్నేశ్వరుడు అక్కడ స్వయంభూగా వెలిసాడు.  వేంకటేశ్వర స్వామి తపస్సు చేస్తున్నట్టుగా పద్మాసనం లోనూ, విఘ్నేశ్వరుడు పురోహితుడిగా నిల్చొని ఉన్నారు.  తరువాత పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాం.  అదృష్టంకొద్దీ హారతి దర్శనం కూడా లభించింది.  రెండు సార్లు దర్శనాలు, రెండు సార్లు ప్రసాదాలు.  అక్కడినుంచి, గోవిందరాజ స్వామి దగ్గరకు కూడా వెళ్లాం.  సాయంత్రం, అప్పలాయగుంట వెళ్లి అక్కడ వెలసిన గోవిందుడిని కూడా చూసి వచ్చాం.  త్రోవలో, జ్ఞ్యాన బాల సుబ్రహ్మణ్యుడు చాలా ముద్దుగా ఉన్నాడు.  రాత్రి తిరుపతిలో బస. 

తెల్లారి లేచి, శ్రీవారి మెట్టు చేరుకున్నాం.  ప్రతీసారీ అలిపిరి నుంచి నడిచేవాళ్ళం, కానీ ఈసారి  శ్రీవారి మెట్టు నుంచి 2388 మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్నాం.  రాత్రి 8 కి దర్శనం చక్కగా జరిగింది. ఆశ్చర్యంగా,  కోవెలలోకి చేరుకున్నాకా ఇంతకుముందులా తోపులాటలు లేవు, హాయిగా దర్శనం అయ్యింది.  రాత్రి తిరుమలలో బస.

ఉదయం లేచి, కొండ దిగువకు బస్సులో వచ్చేసాం.  శ్రీనివాస మంగాపురం లో స్వామిని దర్శించి, మళ్ళీ రావడానికి ఆయన ఆశీర్వాదం తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.  ఈ సారి మజిలీ, పలమనేరు దగ్గరలో మొగలి అనే గ్రామంలో.  స్వయంభూ గా వెలసిన మొగలీశ్వర స్వామి దర్శనం చక్కగా అయ్యింది.  ఇన్ని అద్భుతమైన దర్శనాలు ఇచ్చిన శివకేశవులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటికి వచ్చేసాం.  చాగంటి వారి రామాయణ ప్రవచనం వింటూ ఆనందంగా ప్రయాణం సాగిపోయింది.

పద్మావతి అమ్మవారి ఆలయం ముంగిట

Temples visited:

12-Jan
1. శ్రీ మహా గణపతి దేవస్థానం - కురుడుమలె, ముళబాగిలు
2.  సోమేశ్వర ఆలయం - కురుడుమలె, ముళబాగిలు
3.  గరుడ ఆలయం - కోలాదేవి, ముళబాగిలు
4.  శ్రీ (అర్జున ప్రతిష్ఠిత) ఆంజనేయ ఆలయం - ముళబాగిలు
5.  కూర్మ వరదరాజ ఆలయం - పలమనేరు
6.  వరసిద్ధి వినాయక స్వామి ఆలయం - కాణిపాకం
7.  అగస్త్యేశ్వర స్వామి ఆలయం - తొండవాడ, తిరుపతి
8.  శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం -అవిలాల, తిరుపతి

13-Jan
1.  శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం - శ్రీకాళహస్తి
2.  శ్రీ భూ సమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం - తొండమనాడు
3.  ఆదిత్యేశ్వర స్వామి ఆలయం - బొక్కసంపాలెం
4.  శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం - గుడిమల్లం
5.  శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజ ఆలయం - పాపనాయుడు పేట్
6.  సంతాన సంపద వేంకటేశ్వర స్వామి - వికృతమాల
7.  పద్మావతి అమ్మవారి ఆలయం - తిరుచానూరు, తిరుపతి
8.  శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం - తిరుపతి
9.  సుబ్రహ్మణ్య స్వామి ఆలయం - తానపల్లి, తిరుపతి
10.  శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం - అప్పలాయగుంట

14-Jan
1.  శ్రీవారి మెట్టు - తిరుమల
2.  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం - తిరుమల

15-Jan
1.  శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం - శ్రీనివాస మంగాపురం
2.  శ్రీ మొగలీశ్వర స్వామి ఆలయం - మొగలి, పలమనేరు

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం