ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ వైభోగం !!! ఎలా అయితేనేం, అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చాను. స్వామిని కళ్లారా దర్శించుకోగలిగాను. విపరీతమైన రద్దీలో కూడా ప్రశాంతమైన దర్శనం ప్రసాదించాడు, ఆ హరిహర పుత్రుడు. ఇన్ని రోజులకు దొరికిన అదృష్టం కొద్దీ, శబరిమల ఎక్కుతూ శరణుఘోష వినగలిగాను. అంత పెద్ద కొండపై, ఇంకా పెద్ద గుడిలో, చిన్ని విగ్రహం ఇంకా కళ్ళ ముందే ఉంది సుమా. ఇంతమంది స్వామిమాల ఎందుకు వేసుకుంటారు, ఇంత కఠినమైన నియమాలని ఎలా పాటిస్తారు, నఖ-శిఖ పర్యంతం పవిత్రతని ఎలా కాపాడుకుంటారు, మనసుకి మలినాలు అంటకుండా ఎలా మండలదీక్ష చేస్తారు - ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఎప్పటినుంచో రగులుతున్నవే. అదేమిటో విచిత్రం, అన్నిటికీ సమాధానం మాత్రం, అయ్యప్పని దర్శనంతో దొరికినట్టే అనిపించింది. స్వామిని తన్మయత్వంతో ఆపాదమస్తకం కళ్ళతో జుర్రేస్తూ ఉంటే, ఎవరో భక్తుడు విసిరిన మొక్కుబడి మూట, నా ముక్కుకి తగిలి వాచింది. "ఇన్నాళ్లు రాకుండా ఆలస్యం చేసావేం రా" అని స్వామి ముద్దుగా మందలించాడేమో. ఉదయాన్నే, చంగనూరు లో రైలు దిగి, పంబ వరకూ బస్సులో వెళ్లాం. అక్కడ ...