అంతర్వేది
అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి
స్థలపురాణం:- కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.
క్షేత్ర నామం:- బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.
రక్తవలోచనుని కథ:- ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు.
నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలుపోతాయి అని చెబుతారు.
ఆలయ నిర్మాణ విశేషాలు:- ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన ఖాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసారు. ఈ ఆలయం 300వ సం౹౹లకు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి.
వశిష్టాశ్రమము:- అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము ఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడింది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరము మధ్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు ఉన్నాయి.
Comments
Post a Comment